చూడరమ్మ సతులాల
(అన్నమాచార్య కీర్తన)
Chudaramma satulala lyrics in Telugu with meaning: ఈ కీర్తన తిరుమల వేంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన బహు ప్రాచుర్యం పొందిన కీర్తన.
ఇది వేంకటేశ్వర స్వామితో, లక్ష్మీ దేవి అంశతో పుట్టిన ఆండాళ్ అమ్మవారి వివాహ వేడుకను గూర్చి పాడే పెళ్లి పాట. అన్నమాచార్యుల వారు అక్కడ ఉన్న మహిళలకు అమ్మవారి గొప్పదనాన్ని వివరిస్తూ ఆ మహిళలను కూడా పెళ్లి పాటలు పాడమని ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ పాట కొనసాగుతుంది.
చూడరమ్మ సతులాల – సాహిత్యం అర్థం:
పల్లవి: ఓ సతులాల, తాను ముందుగా ధరించి తరువాత వేంకటేశ్వర స్వామి వారికి అదే మాలను సమర్పించే గోదాదేవి, తన భర్త అయిన వేంకటేశ్వర స్వామితో పెండ్లి పీటల మీద ఉన్నది, వారి పెండ్లి వైభవాన్ని తిలకించి పాటగా పాడండి.
కథ:
పురాణాల ప్రకారం, విష్ణుచితన్ అని పిలువబడే పెరియాళ్వార్, పెరుమాళ్ (విష్ణు) కి గొప్ప భక్తుడు. అతను ప్రతిరోజూ విష్ణుమూర్తికి పూలమాలను సమర్పించేవాడు. అతనికి సంతానం లేదు, పిల్లల కోసం ఆ స్వామివారిని ప్రార్థించేవాడు.
ఒకరోజు గుడిలోపల తోటలో తులసి మొక్క కింద ఒక అమ్మాయి కనిపించింది. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు గోదాదేవిగా నామకరణం చేసి చాలా అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. యుక్త వయస్సుకి వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచింది.
విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలను అలంకరణార్థమై తీసుకొని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.
తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి “తిరుప్పావు” వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.
చరణం-1: ఓ సతులాల, తాను ముందుగా ధరించి తరువాత వేంకటేశ్వర స్వామి వారికి అదే మాలను సమర్పించే కోమలమైన శరీరం కలిగిన ఈ గోదాదేవి,
సాక్షాత్తు లక్ష్మి దేవంట అలాంటప్పుడు ఆమె ఆభరణాలకు, అలంకారాలకు ఏమి తక్కువ? కామదేవుడైన మన్మథుడికి జనని ఆమె అందానికి ఏమి తక్కువ? చంద్రునితో పాటు పుట్టిన ఆవిడ ముఖంలోని కాంతికి ఏమి తక్కువ?
కథ-1:
మన్మథునికి, శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము, శివ పురాణములలో తెలుపబడినవి.
ఇంద్రుడు, ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి, శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు.
ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
మత్స్య పురాణం మరియు భాగవత పురాణాలలో కృష్ణుడు మరియు మన్మథుడి మధ్య సంబంధాన్ని ప్రస్తావించడం జరిగింది. శివునిచే బూడిద చేయబడిన తరువాత మన్మథుడు కృష్ణుని భార్య రుక్మిణి గర్భంలో ప్రద్యుమ్నగా పునర్జన్మ పొందాడు.
కథ-2:
రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుడిని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకొంటారు.
అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి “ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం (పాల సముద్రం చిలకండి) జరపండి” అని చెబుతాడు. “ఆ మథనానికి కవ్వంగా మందరగిరిని వాడండి. త్రాడుగా వాసుకిని వినియోగించండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, బాధలను వారికి మిగల్చండి” అని విష్ణువు సెలవిస్తాడు.
మథనం జరుపుతుండగా హాలాహలం, అమృతం, కామధేనువు, ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు మొదలగు వాటితో పాటు చంద్రుడు, మహాలక్ష్మి కూడా పుడతారు.
అందువలనే అన్నమాచార్యుల వారు వారిరువురిని తోబుట్టువులుగా ఈ చరణంలో, మహాలక్ష్మిని పాల సముద్రానికి కూతురిగా రెండవ చరణంలో, అమృతానికి చుట్టముగా మూడవ చరణంలో చెప్పారు.
చరణం-2: ఓ సతులాల, తాను ముందుగా ధరించి తరువాత వేంకటేశ్వర స్వామి వారికి అదే మాలను సమర్పించే ఆమె శ్రేష్ఠతతో సమానంగా ఎవరూ లేరు. శ్రేష్ఠతను అధిగమించిన ఈ గోదాదేవి,
పాలసముద్రానికి కుమార్తె అలాంటప్పుడు ఆమె గంభీరాలకు ఏమి తక్కువ? ఈ లోకమంతటికి మాతృమూర్తెన ఆమెకి దయ జాలి ఏమి తక్కువ? తామర పువ్వు మీద ఉండే ఆవిడ, మృదు స్వభావానికి ఏమి తక్కువ?
చరణం-3: ఓ సతులాల, తాను ముందుగా ధరించి తరువాత వేంకటేశ్వర స్వామి వారికి అదే మాలను సమర్పించే యుక్త వయస్సులో అందంగా ఉన్న ఈ గోదాదేవి,
దేవతల చేత నమస్కరించబడేది, అలాంటప్పుడు ఆమె గొప్పదనాలకు ఏమి తక్కువ? అమృతానికి బంధువు, ఆమె సంతోషానికి ఏమి తక్కువ? ఇన్ని సుగుణాలను, గొప్పదనాలను కలిగిన శ్రీ మహాలక్ష్మిని వలచి, శ్రీ వేంకటేశ్వర స్వామి తనకు తానుగా వచ్చి పెళ్లి చేసుకున్నాడు.
Click here for pdf చూడరమ్మ సతులాల (Chudaramma satulala lyrics in Telugu)
And click here for English
చిట్క:
పాట నేర్చుకోవాలంటే ఏమి చెయ్యాలి??: మొదటగా నేర్చుకోవాలనుకుంటున్న పాటను రాసుకోవాలి. రెండు, మూడుసార్లు చదవాలి, దాని అర్థం తెలుసుకోవాలి, అప్పుడు దానిని బాగా వినాలి, తరువాత పాటను విడదీసి నేర్చుకోవాలి, సాధన మొదలుపెట్టాలి, అప్పుడు ఆ పాట మనకు వస్తుంది.
పైన చెప్పిన విధానం పాటించకుండా ఒకటి రెండు సార్లు పాటను వినేసి పాడేసి మనకు వచ్చింది అని అనుకోకూడదు.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….
← ఇందరికీ అభయంబు అదివో అల్లదివో →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం, కూచిపూడి మరియు పాశ్చాత్య (Western) నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org